Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి1వఅధ్యాయము

1  అబ్రాహాము కుమారుడగు దావీదుయొక్క కుమారుడైన యేసుక్రీస్తు1 వంశావళి. 
2  అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, 
3  యూదా తామారునందు పెరెసును జెరహునును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, 
4  ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, 
5  నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిను కనెను, 
6  యెష్షయి రాజైన దావీదును కనెను. దావీదు ఊరియా భార్యయైన ఆమెయందు సొలొమోనును కనెను, 
7  సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను, 
8  ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, 
9  ఉజ్జియా యోవతామును కనెను, యోవతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, 
10  హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను, 
11  జనులు బాబెలుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. 
12  బాబెలుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను, 
13  జెరుబ్బాబెలు అబీహోదును కనెను, అబీహోదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను, 
14  అజోరు సాదోకును కనెను, సాదోకు అకీమును కనెను, అకీము ఎలీహోదును కనెను, 
15  ఎలీహోదు ఎలాజారును కనెను, ఎలాజారు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, 
16  యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. 
17  ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు పర్యంతము తరములన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బాబెలుకు కొనిపోబడిన కాలపర్యంతము పదునాలుగు తరములు; బాబెలుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు పర్యంతము పదునాలుగు తరములు. 
18  యేసుక్రీస్తు జన్మవిధ మెట్లనగా ఆయన తల్లియైన మరియ యోసేపుకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. 
19  ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. 
20  అతడు ఈసంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభువుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్బము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; 
21  ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు2 అను పేరు పెట్టుదువనెను. 
22  ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు 
23  అని ప్రభువు తన ప్రవక్తద్వారా3పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. 
24  యేసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొని 
25  ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను; అతడాకుమారునికి యేసు అను పేరు పెట్టెను. 
Download Audio File

మత్తయి2వఅధ్యాయము

1  రాజైన హేరోదు దినములయందు యూదైయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి 
2  - యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. 
3  హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితోకూడ యెరూషలేమువారందరును కలవరపడిరి. 
4  కాబట్టి రాజు ప్రధానయాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి - క్రీస్తు ఎక్కడ పుట్టునని వారి నడిగెను. 
5  అందుకు వారు - యూదైయ బేత్లెహేములోనే; యేలయనగాయూదైయదేశపు బేత్లెహేమానీవు యూదా ప్రధానులలోఎంతమాత్రమును అల్పమైనదానవు కావుఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతినీలోనుండి వచ్చునుఅని ప్రవక్తద్వారా1వ్రాయబడియున్నదనిరి. 
6-7. అంతట హేరోదు ఆ జ్ఞనులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని 
8  - మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేముకు పంపెను. 
9  వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువుండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను. 
10-11. వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. 
12  తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి. 
13  వారు వెళ్లినతరువాత ప్రభువు దూత స్వప్నమందు యేసేపుకు ప్రత్యక్షమై- హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవులేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తుకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. 
14-15. అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తుకు వెళ్లి ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారాప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణపర్యంతము అక్కడుండెను. 
16  ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను. 
17  అందువలన- రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదనధ్వనియు కలిగెను 
18  రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయా ద్వారాచెప్పబడిన వాక్యము నెరవేరెను. 
19  హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమై 
20  నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము; 
21  శిశువు ప్రాణము తీయజూచుచుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. 
22-23. అయితే ఆర్కెలాయు తన తండ్రియైన హేరోదుకు ప్రతిగా యూదైయదేశము ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచే బోధింపబడినవాడై గలిలైయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను. ) 
Download Audio File

మత్తయి3వఅధ్యాయము

1  ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి 
2  - పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదైయ అరణ్యములో ప్రకటించుచుండెను. 
3  ప్రభువు మార్గము సిద్ధపరచుడిఆయన త్రోవలు సరాళము చేయుడనిఅరణ్యములో కేకవేయు ఒకని శబ్దముఅని ప్రవక్తయైన యెషయా ద్వారాచెప్పబడినవాడితడే 
4  ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారమై యుండెను. 
5  ఆ సమయమున యెరూషలేమువారును యూదైయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును అతనియొద్దకు వచ్చి 
6  తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. 
7  అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి - సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? 
8  మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి. 
9  అబ్రాహాము మాకు తండ్రి ఆని మీలో మీరు చెప్పుకొన తలచవద్దు; దేవుడు ఈరాళ్ళవలన అబ్రాహాముకు పిల్లలను పుట్టి0పగలడని మీతో చెప్పుచున్నాను. 
10  ఇప్పుడే గోడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతిచెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. 
11  మారుమనస్సునిమిత్తము నేను నీళ్ళలోమీకు బాప్తిస్మమిచ్చుచున్నాను;అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైన నేనుపాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోనుఅగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. 
12  ఆయన, చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి గోధుమలను కొట్టులో పోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని చెప్పెను. 
13  ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలైయనుండి యొర్దాను దగ్గరనున్న అతనియొద్దకు వచ్చెను. 
14  అందుకు యోహాను - నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింప చూచెను గాని 
15  యేను - ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. 
16  యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డుకు వచ్చెను; అప్పుడు ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. 
17  మరియు - ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. 
Download Audio File

మత్తయి4వఅధ్యాయము

1  అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపొబడెను. 
2  నలువది దినములు దివారాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా 
3  ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి - నీవు దేవుని కూమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. 
4  అందుకాయన - మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించునుఅని వ్రాయబడియున్నదనెను. 2
5  అంతట అపవాదిపరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయశిఖరమున ఆయనను నిలువబెట్టి 
6  - నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము - ఆయన నిన్నుగూర్చి తన దూతలకాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగలకుండ వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. అని వ్రాయబడియున్నదనిఆయనతో చెప్పెను. 
7  అందుకు యేసు -ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరియొకచోటవ్రాయబడియున్నదని వానితో చెప్పెను.  
8  పిమ్మట అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోకరాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి 
9  నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల ఇవన్నియు నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా 
10  యేసు వానితో - సాతానా, పొమ్ము - నీ దేవుడైన ప్రభువుకు నమస్కరించి ఆయనను మాత్రమే సేవింపవలెను. అని వ్రాయబడియున్నదనెను. 5
11  అంతట అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్యచేసిరి. 
12  యోహాను చెరలో ఉంచబడెనని యేసు విని గలిలైయకు తిరిగి వెళ్లి 
  13-16. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలిదేశమును యొర్దాను కావలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలైయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్నవారికి వెలుగు ఉదయించెనుఅని ప్రవక్తయైన యెషయాద్వారాపలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను. ) 
17  అప్పటినుండి యేసు - పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడనిచెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను.  
18  యేసు గలిలైయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. 
19-20. ఆయన - నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 
21  ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రియైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసికొనుచుండగా చూచి వారిని పిలిచెను. 
22  వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 
23  యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలైయయందంతట సంచెరించెను. 
24  ఆయన కీర్తి సురియదేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువుగలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. 
25  గలిలైయ దెకపొలి యెరూషలేము యూదైయయను ప్రదేశములనుండియు యొర్దానుకు అవతలనుండియు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను. 
Download Audio File

మత్తయి5వఅధ్యాయము

1  ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయనయొద్దకు వచ్చిరి. 
2  అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను - 
3  ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. 
4  దుఃపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. 
5  సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. 
6  నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు. 
7  కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. 
8  హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. 
9  సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు. 
10  నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. 
11  నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. 
12  సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. 
13  మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకేగాని మరి దేనికిని పనికిరాదు. 
14  మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు. 
15  మనుష్యులు దీపము వెలిగించి కుంచముక్రింద పెట్టరు గాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. 
16  మనుష్యులు మీ సత్ క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి. 
17  ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల (వచనముల) నైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. 
18  ఆకాశమును భూమియు గతించిపోతేనే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 
19  కాబట్టి యీ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో గొప్పవాడనబడును. 
20  శాస్త్రుల నీతికంటెను పరిశయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. 
21  నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులలో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. 
22  నేను మీతో చెప్పునదేమనగా - తన సహోదరునిమీదకోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు సభకు లోనగును;ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. 
23  కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన పక్షమున 
24  అక్కడ బలిపీఠము ఎదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము అర్పింపుము. 
25  నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. 
26  కడపటి కాసు చెల్లించువరకు అక్కడనుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 
27  వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; 
28  నేను మీతో చెప్పునదేమనగా - ఒక స్త్రీని మోహపుచుపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. 
29  నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయును; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. 
30  నీ కుడిచెయ్యి నిన్ను అభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. 
31  తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగపత్రికను ఇయ్యవలెనని చెప్పబడియున్నది గదా; 
32  నేను మీతో చెప్పునదేమనగా - వ్యభిచార కారణమునుబట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదాని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. 
33  మరియు - నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; 
34  నేను మీతో చెప్పునదేమనగా - ఎంతమాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు; ఆకాశము తోడని వద్దు, అది దేవుని సింహాసనము; 
35  భూమి తోడని వద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడని వద్దు, అది మహారాజు పట్టణము. 
36  నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. 
37  మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని యుండవలెను; వీటిని మించునది దుష్టునినుండిపుట్టునది. 
38  కంటికి కన్ను పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. 
39  నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము. 
40  ఎవడైన నీమీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసికొనగోరినయెడల వానికి నీ పై వస్త్రముకూడ ఇచ్చివేయుము. 
41  ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల వానితోకూడ రెండు మైళ్లు వెళ్లుము. 
42  నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. 
43  నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; 
44  నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించువారికొరకు ప్రార్ధన చేయుడి. 
45  ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. 
46  మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. 
47  మీ సహోదరులకు మాత్రమే వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా. 
48  మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.  
Download Audio File

మత్తయి6వఅధ్యాయము

1  మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి, లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు. 
2  కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 
3  నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమ చేతికి తెలియక యుండవలెను. 
4  అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 
5  మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారులవలె ఉండవద్దు; మనుష్యులకు కనబడెవలనని సమాజమందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 
6  నీవు ప్రార్థనచేయునప్పుడు నీ గదిలోకి వెళ్లి తలుపువేసి, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 
7  మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు; 
8  మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగకమునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియును; 
9-10. పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధ పరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక, 
11  మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. 
12  మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము. 
13  మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండిమమ్మును తప్పించుము. 2
14  మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. 
15  మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. 
16  మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారలవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 
17  ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. 
18  అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 
19  భూమి మీద మీకొరకు ధనము కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. 
20  పరలోకమందు మీకొరకు ధనము కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. 
21-22. నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. 
23  నీ కన్ను చెడినదైతే దేహమంతయు చీకటిమయమై యుండును; నీలో నున్న వెలుగు చీకటియైయుంటే ఆ చీకటి యెంతో గొప్పది. 
24  ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. 
25  అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమా అని మీ దేహమును గూర్చియైనను, చింతింపకుడి, ఆహారముకంటె ప్రాణమును, వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? 
26  ఆకాశపక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్టులు కారా? 
27  మీలో ఎవడు చింతించుటవలన తన యెత్తు మూరెడు ఎక్కువ చేసికొనగలడు? 
28  వస్త్రములనుగూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు ఒడకవు 
29  అయినను తన సమస్త వైభవముతోకూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దానివలెనైను అలంకరింపబడలేదు. 
30  నేడు ఉండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. 
31  కాబట్టి - ఏమి తిందుమో యేమి త్రాగదుమో యేమి ధరించకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. 
32  ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. 
33  కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి; అప్పడవన్నియు మీకనుగ్రహింపబడును. 
34  రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.  
Download Audio File

మత్తయి7వఅధ్యాయము

1  మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. 
2  మీరు తీర్చు తీర్పుచొప్పుననే మిమ్మునుగూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలువబడును. 
3  నీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుట యేల? 
4  నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి - నీ కంటిలో నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల? 
5  వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. 
6  పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చివేయును. 
7  అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, 
8  తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. 
9  మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? 
10  చేపను అడిగినయెడల పామునిచ్చునా? 
11  మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును. 
12  కావున మనుష్యులు మీకు ఏమేమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల (ఉపదేశమునై)యున్నది. 
13-14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే. 
15  అబద్ధ ప్రవక్తలుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొర్రెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. 
16  వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్షపండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? 
17  ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. 
18  మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. 
19  మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. 
20  కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు 
21  - ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. 
22  ఆ దినమందు అనేకులు నన్ను చూచి - ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. 
23  అప్పుడు - నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారతో చెప్పుదును. 
24  కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడు బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి యుండును. 
25  వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. 
26  మరియు ఈ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. 
27  వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.  
28  యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. 
29  ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను. 
Download Audio File