Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి10వఅధ్యాయము

1  ఆయన తన పన్నెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చెను. 
2  ఆ పన్నెండుమంది అపొస్తలుల పేళ్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను; మరియు అతని సహోదరుడగు అంద్రెయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, 
3  ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరు గల లెబ్బయి, 
4  కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. 
5  యేసు ఆ పన్నెండు మందిని పంపివేయుచు, వారిని చూచి వారికాజ్ఞాపించినదేమనగా - మీరు అన్యజనుల దారిలోకి వెళ్లకుడి, సమరైయుల యే పట్టణములలోనైనను ప్రవేశింపకుడి గాని 
6  ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెలయొద్దకే వెళ్లుడి. 
7  వెళ్లుచు - పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి. 
8  రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. 
9  మీ సంచులలో బంగారునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను కర్రనైనను సిద్దపరచుకొనకుడి; 
10  పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా 
11  మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లు వరకు అతని యింటనే బసచేయుడి. 
12  ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి. 
13  ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. 
14  ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండినయెడల మీరు ఆ యిల్లయినను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. 
15  విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగినదైయుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 
16  ఇదిగో తోడేళ్లమధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులను పావురములవలె నిష్కపటులునై యుండుడి. 
17  మనుష్యులను గూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహా సభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. 
18  వీరికిని అన్యజనులకును సాక్ష్యార్ధమై నా నిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడదురు. 
19  వారు మిమ్మును అప్పగించుచున్నప్పుడు, - ఏలాగు మాటలాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును. 
20  మీ తండ్రి ఆత్మ మీలోఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడు వారు మీరు కారు. 
21  సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు. 
22  మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతము వరకు సహించినవాడు రక్షింపబడును. 
23  వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 
24  శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు. 
25  శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జబూలని వారు పేరు పెట్టియుండినయెడల ఆయన యింటివారికి మరినిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. 
26  కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియు బయలుపరచబడక పోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. 
27  చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి. 
28  మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 
29  రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. 
30-31. నీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్టులు. 
32  మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రియెదుట నేను వానిని ఒప్పుకొందును. 
33  మనుష్యులయెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనెరగనందును. 
34  నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. 
35  ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. 
36  ఒక మనుష్యుని యింటివారే శత్రువులగుదురు. 
37  తండ్రినైనను తల్లినైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; 
38  తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. 
39  తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. 
40  మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. 
41  ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. 
42  మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.  

No comments:

Post a Comment