Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి15వఅధ్యాయము

1  ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి 
2  - నీ శిష్యులు చేతులు కడుగకొనకుండ భోజనము చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. 
3  అందుకాయన - మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? 
4  తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. 2
5  మీరైతే - ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి - నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితముని చెప్పినయెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. 
6  మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.  
7-9. వేషధారులారా -ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములనిబోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారుఅని యెషయామిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి 
10  జనసమూహములను పిలిచి - మీరు విని గ్రహించుడి; 
11  నోటపడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోటనుండి వచ్చునది మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. 
12  అంతట ఆయన శిష్యులు వచ్చి - పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా 
13  ఆయన - పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. 
14  వారి జోలికి పోకుడి; వారు గుడ్డివారైయుండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. 
15  అందుకు పేతురు - ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా 
16  ఆయన - మీరును ఇంతవరకు అవివేకులై యున్నారా? 
17  నోటిలోకి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని 
18  నోటనుండి బయటికి వచ్చునవి హృదయములోనుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? 
19  దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే గదా వచ్చును? 
20  ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. 
21-22. యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చి - ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. 
23  అందుకాయన ఆమెతో ఒక్క మాటయైన చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి - ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా 
24  ఆయన - ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెలయొద్దకే నేను పంపబడితిని గాని మరి ఎవరియొద్దకును పంపబడలేదనెను. 
25  అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి - ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. 
26  అందుకాయన - పిల్లలరొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా 
27  ఆమె - నిజము ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. 
28  అందుకు యేసు - అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనొందెను. 
29  యేసు అక్కడనుండి వెళ్లి గలిలైయ సముద్రతీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా 
30  బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను. 
31  మూగవారు మాటలాడుటయు అంగహీనులు బాగుపడుటయు కుంటివారు నడుచుటయు గుడ్డివారు చూచుటయు జనసమూహము చూచి ఆశ్యర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. 
32  అంతట యేసు తన శిష్యులను పిలిచి - ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిననేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా 
33  ఆయన శిష్యులు - ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి. 
34  యేసు - మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారినడుగగా వారు - ఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి. 
35  అప్పుడాయన - నేలమీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి 
36  ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను, శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. 
37  వారందరు తిని తృప్తిపొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి. 
38  స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగు వేలమంది పురుషులు. 
39  తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోనె యెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. 
Download Audio File

No comments:

Post a Comment