Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి20వఅధ్యాయము

1  ఏలాగనగా - పరలోకరాజ్యము ఇంటి యజమానుడైన యొకని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయులుదేరి 
2  దినమునకు ఒక దేనారముచొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్షతోటలోకి వారిని పంపెను. 
3  తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంతవీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి 
4  - మీరును నా ద్రాక్షతోటలోకి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి. 
5  దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరల వెళ్లి ఆలాగే చేసెను. 
6  తిరిగి దాదాపు అయిదు గంటలకు వెళ్లి మరికొందరు నిలిచియుండగా చూచి - ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలుచున్నారని వారిని అడుగగా 
7  వారు - ఎవడును మమ్మును కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు - మీరును నా ద్రాక్షతోటలోకి వెళ్లుడనెను. 
8  సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచి - పనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చినవారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. 
9  దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసికొనిరి. 
10  మొదట వచ్చినవారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. 
11-12. వారది తీసికొని - చివరవచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పని చేసినను, పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానముచేసితివే అని ఆ యింటి యజమానునిమీద సణుగుకొనిరి. 
13  అందుకతడు వారిలో ఒకని చూచి - స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? 
14  నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము; నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకిష్టమైనది; 
15  నాకిష్టము వచ్చినట్టు నా స్వంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదాఅని చెప్పెను. 
16  ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారగుదురు మొదటివారు కడపటివారగుదురనెను. 
17  యేసు యెరూషలేముకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పన్నెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి మార్గమందు వారితో ఇట్లనెను 
18  - ఇదిగో యెరూషలేముకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణ శిక్ష విధించి 
19  ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును. 
20  అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులను వెంటబెట్టుకొని ఆయనయొద్దకు వచ్చి నమస్కారము చేసి యొక మనవి చేయబోగా 
21  - నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె - నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. 
22  అందుకు యేసు - మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు - త్రాగగలమనిరి. 
23  అయన - మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరుకునని చెప్పెను. 
24  తక్కిన పదిమంది శిష్యులు ఈ మాటవిని ఆ యిద్దరు సహోదరులమీద కోపపడిరి 
25  గనుక యేసు వారిని పిలిచి - అన్యజనులలో అధికారులు వారిమీద కఠినముగా ప్రభుత్వము చేయుదురనియు మీకు తెలియును. 
26  మీలో అలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; 
27  మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడైయుండవలెను. 
28  అలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులుకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెనని చెప్పెను. 
29  వారు యెరికోనుండి వెళ్లుచుండగా బహు జనసమూహము ఆయనవెంట వెళ్లెను. 
30  అప్పుడు త్రోవ ప్రక్కన కూర్చున్న యిద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లుచున్నాడని విని - ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలువేసిరి. 
31  ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు - ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి పెద్ద కేక వేసిరి. 
32  యేసు నిలిచి వారిని పిలిచి - నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా 
33  వారు - ప్రభువా, మా కన్నులు తెరువవలెననిరి. 
34  కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు దృష్టిపొంది ఆయన వెంట వెళ్లిరి. 
Download Audio File

No comments:

Post a Comment