Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి26వఅధ్యాయము

1  యేసు ఈ మాటలన్నియు చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి 
2  - రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను. 
3  ఆ సమయమున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోకి కూడివచ్చి 
4  యేసును మాయోపాయముచేత పట్టుకొని చంపవలెనని యేకమై ఆలోచన చేసిరి. 
5  అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు - పండుగలో వద్దని చెప్పుకొనిరి. 
6-7. యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా ఆయన తలమీద దాని పోసెను. 
8  శిష్యులు చూచి కోపముతో మండిపడి - ఈ నష్టమెందుకు? 
9  ఇది గొప్ప వెలకు అమ్మి బీదల కియ్యవచ్చునే అనిరి. 
10  యేసు ఆ సంగతి తెలిసికొని - ఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు? 
11  బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు గాని నేనెల్లప్పుడు మీతో కూడ ఉండను. 
12  ఈమె యీ అత్తరు నా శరీరముమీద పోసి నా భూస్థాపన నిమిత్తము ఇది చేసెను. 
13  సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. 
14  అప్పుడు పన్నెండు మందిలో ఇస్కరియోతు యూదా అను నొకడు ప్రధాన యాజకులయొద్దకు వెళ్లి 
15  - నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణెములు వానికి తూచి ఇచ్చిరి. 
16  వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. 
17  పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి - పస్కాను భుజించుటకు మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి. 
18  అందుకాయన - మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యునియొద్దకు వెళ్లి - నా కాలము సమీపమైయున్నది; నా శిష్యులతో కూడ నీ యింట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. 
19  యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి. 
20  సాయంకాలమైనప్పుడు ఆయన పన్నెండుమంది శిష్యులతో కూడ భోజనమునకు కూర్చుండెను. 
21  వారు భోజనము చేయుచుండగా ఆయన - మీలో ఒకడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. 
22  అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును - ప్రభువా, నేనా? అని ఆయన నడుగగా 
23  ఆయన - నాతోకూడ పాత్రలో చెయ్యి ముంచినవాడే నన్ను అప్పగించువాడు. 
24  మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడినప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టకుంటే వానికి మేలని చెప్పెను. 
25  ఆయనను అప్పగించిన యూదా - బోధకుడా, నేనా? అని అడుగగా ఆయన - నీవన్నట్టే అనెను. 
26  వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి - మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. 
27  మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి - దీనిలోనిది మీరందరు త్రాగుడి. 
28  ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకులకొరకు చిందింపబడుచున్న నిబంధనరక్తము. 
29  నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగుదినమువరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను. 
30  అంతట వారు కీర్తన పాడి ఒలీవచెట్ల కొండకు వెళ్లిరి. 
31  అప్పుడు యేసు వారిని చూచి - ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా -గొర్రెలకాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా. 2
32  నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలైయకు వెళ్లెదననెను. 
33  అందుకు పేతురు - నీ విషయమై అందరు అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా 
34  యేసు అతని చూచి - ఈ రాత్రి కోడికూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. 
35  పేతురాయనను చూచి - నేను నీతోకూడ చావవలసివచ్చినను నిన్ను ఎరుగనని చెప్పననెను; అదే ప్రకారము శిష్యులందరు అనిరి. 
36  అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి- నేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి 
37  పేతురును జెబెదయి కుమారులను వెంటపెట్టుకొనిపోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. 
38  అప్పుడు యేసు - నా ప్రాణము మరణమగునంతగా బహుదుఃఖము పొందుచున్నది; మీరు ఇక్కడ నిలిచి నాతోకూడ మెళకువగా నుండుడని వారితో చెప్పి 
39  కొంతదూరము వెళ్లి సాగిలపడి -నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్దనుండి తొలగిపోనిమ్ము; అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. 
40  ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి వారు నిద్రంచుట చూచి - ఒక గడియైనను నాతో కూడ మేల్కొని యుండలేరా? 
41  మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెళకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమేగాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి 
42  మరల రెండవమారు వెళ్లి - నా తండ్రీ, నేను దీని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగిపోవుట అసాధ్యమైతే నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి 
43  తిరిగి వచ్చి వారు మరల నిద్రించుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. 
44  ఆయన వారిని మరల విడిచి వెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్థనచేసెను. 
45  అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చి - ఇకను నిద్రపోయి అలసట తీర్చుకొనుడి; ఇదిగో సమయము సమీపించియున్నది; మనుష్యకుమారుడు పాపులచేతులకు అప్పగింపబడుచున్నాడు; 
46  లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి యున్నాడని వారితో చెప్పెను. 
47  ఆయన ఇంక మాటలాడుచుండగా పన్నెండుమందిలో ఒకడైన యూదా వచ్చెను. వానితో కూడ బహుజనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్దనుండియు వచ్చెను. 
48  ఆయనను అప్పగించువాడు - నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి 
49  వెంటనే యేసు నొద్దకు వచ్చి - బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దుపెట్టుకొనెను. 
50  యేసు - చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గిరకువచ్చి యేసును బలవంతముగా పట్టుకొనిరి. 
51  అంతట యేసుతోకూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. 
52  యేసు - నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొనువారందరు కత్తిచేతనే నశింతురు. 
53  ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన పక్షమున ఆయన పన్నెండు సైన్య వ్యూహములకంటెఎక్కువమంది దూతలను నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? 
54  (నేను వేడుకొనిన పక్షమున) - ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను. 
55  ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి - బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. 
56  అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు సంభవించెనని చెప్పెను. అప్పడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి. 
57  యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయపయొద్దకు ఆయనను తీసికొనిపోగా అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి. 
58  పేతురు ప్రధానయాజకుని యింటి ముంగిటవరకు ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికి పోయి - దీని అంతమేమవునో చూడవలెనని బంట్రౌతులతో కూడ కూర్చుండెను. 
59  ప్రధానయాజకులును మహా సభవారందరును యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి గాని 
60  అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్షమేమియు దొరకలేదు. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చి 
61  - వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దాని కట్టగలనని చెప్పెననిరి. 
62  ప్రధానయాజకుడు లేచి - నీవు ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. 
63  అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి - నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవునితోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు - నీవన్నట్టే. 
64  ఇదిమొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా 
65  ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని - వీడు దేవదూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణమాట మీరు ఇప్పుడు విన్నారుగాదా; 
66  మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారు - వీడు మరణమునకు పాత్రుడనిరి. 
67  అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి; 
68  కొందరు ఆయనను అరచేతులతో కొట్టి - క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడు మాతో చెప్పుమనిరి. 
69  పేతురు వెలపటిముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చి - నీవును గలిలైయుడగు యేసుతో కూడ ఉంటివి గదా అనెను. 
70  అందుకతడు - నేనుండలేదు; నీవు చెప్పుసంగతి నాకు తెలియదని అందరియెదుట అనెను. 
71  అతడు నడవలోకి వెళ్లిన తరువాత మరియొక చిన్నది అతని చూచి - వీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడివారితో చెప్పగా 
72  అతడు ఒట్టుపెట్టుకొని - నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను. 
73  కొంచెము సేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురు నొద్దకు వచ్చి - నిజమే నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుబట్టి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. 
74  అందుకు అతడు - ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడికూసెను. 
75  గనుక - కోడి కూయకమునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలపలికి పోయి సంతాపపడి యేడ్చెను. 
Download Audio File

No comments:

Post a Comment