Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి16వఅధ్యాయము

1  అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను. 
2  - సాయంకాలమున మీరు - ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురువదనియు, 
3  ఉదయమున - ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశవైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు. 
4  వ్యభిచారులైన చెడ్డతరమువారు సూచకక్రియ నడుగుచున్నారు; అయితే యోనాను గూర్చిన సూచక క్రియయేగాని మరి ఏ సూచక క్రియయైన వారికనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను. 
5  ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. 
6  అప్పుడు యేసు - చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడని వారితో చెప్పెను. 
7  కాగా వారు - మనము రొట్టెలు తేనెందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. 
8  యేసు అది యెరిగి -అల్పవిశ్వాసులారా - మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? 
9  మీరింక గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను 
10  ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకములేదా? 
11  నేను రొట్టెలనుగూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను. 
12  అప్పుడు రొట్టెల పులిసిన పిండినిగూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధనుగూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. 
13  యేసు ఫిలిప్పుదైన కైసరైయ ప్రాంతములకు వచ్చి - మనుష్యకుమారుడెవడని జనులు చెప్పుకొనుచన్నారని తన శిష్యులను అడుగగా 
14  వారు - కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. 
15  అందుకాయన -మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారినడిగెను. 
16  అందుకు సీమోను పేతురు -నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువనిచెప్పెను. 
17  అందుకు యేసు -సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరచెనేగాని నరులునీకు బయలుపరచలేదు. 
18  మరియు నీవు పేతురువు, 2ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. 
19  పరలోకరాజ్యముయొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. 
20  అటుపిమ్మట తాను క్రీస్తు అనియెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. 
21  అప్పటినుండి, తాను యెరూషలేముకు వెళ్లి, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలుపొంది చంపబడి మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా 
22  పేతురు ఆయనను ఒకవైపుకు తీసికొనిపోయి - ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దించెను. 
23  అయితే ఆయన పేతురు వైపు తిరిగి - సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతరకారణమై యున్నావు; నీవు మనుష్యుల సంగతులనే మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకయున్నావని పేతురుతో చెప్పెను. 
24  అప్పుడు యేసు తన శిష్యులను చూచి - ఎవడైనను నా వెంబడి రాగోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని తన సిలువ నెత్తికొని నన్ను వెంబడింపవలెను. 
25  తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. 
26  ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? 
27  మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతోకూడ రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును. 
28  ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచుపర్యంతము మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. 
Download Audio File

No comments:

Post a Comment