Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి27వఅధ్యాయము

1  ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచనచేసి 
2  ఆయనను బంధించి తీసికొనిపోయి అధిపతియైన పొంతిపిలాతుకు అప్పగించిరి. 
3  అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణెములు ప్రధానయాజకులయొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి 
4  - నేను నిరపరాధరక్తమును2అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు - అది మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా 
5  అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టుకొనెను. 
6  ప్రధానయాజకులు ఆ వెండి నాణెములు తీసికొని - ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుకపెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. 
7  కాబట్టి వారు ఆలోచనచేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. 
8  అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. 
9  అప్పుడు -విలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలోకొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది వెండి నాణెములు తీసికొని 
10  ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరవాని పొలమున కిచ్చిరి. అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా3చెప్పబడినమాట నెరవేరెను. 
11  యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతి - యూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచి - నీవన్నట్టే అనెను. 
12  ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు. 
13  కాబట్టి పిలాతు - నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను. 
14  అయితే ఆయన యొక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. 
15  పండుగలో జనులు కోరుకొనిన యొక ఖయిదీని వారికి విడుదల చేయుట అధిపతికి వాడుకయై యుండెను. 
16  ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను. 
17-18. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు - నేను మీకెవని విడుదలచేయ గోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగియుండెను. 
19  అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య - నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతనియొద్దకు వర్తమానము పంపెను. 
20  ప్రధానయాజకులును పెద్దలును బరబ్బను విడిపింపనడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. 
21  అధిపతి - నేను ఈ యిద్దరిలో మీకెవని విడుదలచేయ గోరుచున్నారని వారినడుగగా వారు - బరబ్బనే అనిరి. 
22  అందుకు పిలాతు - ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా - సిలువవేయుమని అందరును చెప్పిరి. 
23  అధిపతి - సరేగాని యితడేమి దుష్కార్యము చేసెనని అడుగగా వారు - సిలువవేయుమని ఎక్కువగా కేకలువేసిరి. 
24  పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు కాలేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుగొని - ఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. 
25  అందుకు ప్రజలందరు - వాని రక్తము మామీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి. 
26  అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను. 
27  అప్పుడు అధిపతియొక్క రాణువవారు యేసును అధికారమందిరములోకి తీసికొనిపోయి, ఆయనయొద్ద తమ స్తోమమంతయు సమకూర్చిరి. 
28  వారు ఆయన వస్త్రములు తీసివేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి 
29  ముండ్లకిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడిచేతను ఉంచి, ఆయనయెదుట మోకాళ్లూని - యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి 
30  ఆయనమీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి. 
31  ఆయనను అపహసించిన తరువాత ఆయనమీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగించి సిలువవేయుటకు ఆయనను తీసికొనిపోయిరి. 
32  వారు వెళ్లుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువమోయుటకు అతని బలవంతము చేసిరి. 
33  వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి 
34  చేదు కలిపిన ద్రాక్షరసము ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దాని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. 
35  వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. 
36  అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావిలియుండిరి. 
37  ఇతడు యూదులరాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. 
38  మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడ సిలువవేయబడిరి. 
39  ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు 
40  దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. 
41  ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు 
42  - ఇతరులను రక్షించెను; తన్నుతానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజు గదా; యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము. 
43  వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయన కిష్టుడైతే ఆయన ఇప్పుడు వాని తప్పించునని చెప్పిరి. 
44  ఆయనతో కూడ సిలువవేయబడిన బందిపోటు దొంగలును ఆలాగే ఆయనను నిందించిరి. 
45  మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను. 
46  ఇంచుమించు మూడుగంటలప్పుడు యేసు - ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. 
47  అక్కడ నిలిచియున్నవారిలో కొందరామాట విని - ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి. 
48  వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి స్పంజీ తీసికొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను; 
49  తక్కినవారు - ఊరకుండుడి, ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి. 1
50  యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. 
51  అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను; 
52  సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరములు లేచెను. 
53  వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధపట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. 
54  శతాధిపతియు అతనితోకూడ యేసుకు కావలియున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నియు చూచి మిక్కిలి భయపడి - నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. 
55  యేసుకు ఉపచారముచేయుచు గలిలైయనుండి ఆయనను వెంబడించిన అనేక స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి. 
56  వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు జెబదయి కుమారుల తల్లియు ఉండిరి. 
57  సాయంకాలమైనప్పుడు యేసుకు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు వచ్చి 
58  పిలాతు నొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని ) అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను. 
59  యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి 
60  తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను. 
61  మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి. 
62  మరునాడు, అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతునొద్దకు కూడి వచ్చి 
63  - అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు - మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. 
64  కాబట్టి మూడవ దినపర్యంతము సమాధిని భద్రముచేయ నాజ్ఞాపించుము; వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొనిపోయి - ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటిది మరి చెడ్డదై యుండునని చెప్పిరి. 
65  అందుకు పిలాతు - ఇదిగో కావలి; మీరు వెళ్లి మీచేతనైనంతమట్టుకు సమాధిని భద్రముచేయుడని వారితో చెప్పెను. 
66  వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి. 
Download Audio File

No comments:

Post a Comment